: 'బదిలీలు కొత్తేం కాదు... ఇది నాకు అలవాటే' అంటున్న కర్ణాటక పోలీసాఫీసర్ రూప!
అక్రమాలు బయటపెట్టినందుకు అన్యాయంగా బదిలీ చేస్తారా? అని తాను ప్రశ్నించలేదు. కారణం ఇలాంటి బదిలీలను తన 16 ఏళ్ల కెరీర్లో 25 సార్లు చూడటం. నిజాయతీ ఫలితం బదిలీయా? అని కూడా తాను అడగలేదు. కారణం నిజాయతీగా ఉండటం వల్ల వచ్చే సంతృప్తి తనకు తెలుసు కాబట్టి. ఎన్ని బదిలీలు అయినా తన బాధ్యతలు నిర్వహించడమే పరమావధిగా పనిచేస్తారు పోలీస్ ఆఫీసర్ రూప మౌద్గిల్.
పరప్పన అగ్రహారం జైల్లో అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని, అందుకు ఆమె రూ. 2 కోట్లు లంచం ఇచ్చిందనే విషయాలను వృత్తి నియమాలను ఉల్లంఘిస్తూ మీడియాకు వెల్లడించిందనే నెపంతో కర్ణాటక ప్రభుత్వం ఆమెను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేసింది. ఆమె మాత్రం పాత విషయాలు ఏం పట్టించుకోకుండా కొత్త బాధ్యతలకు ఎలా న్యాయం చేయాలనే విషయం గురించి ఆలోచిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు రహదారులపై వాహనాల నియంత్రణ, ట్రాఫిక్ తగ్గింపు, నిఘా వంటి చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూనే, ఈ విభాగంలో కూడా జరుగుతున్న అక్రమాలపై ఉక్కుపాదం మోపేందుకు తానెప్పుడూ సిద్ధమే అంటున్నారు రూప.