: నీ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డావు: జ‌గ‌న్‌పై మండిప‌డ్డ మంత్రి ఉమా


ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గన్మోహ‌న్ రెడ్డి త‌న‌ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డాడ‌ని ఏపీ మంత్రి ఉమా మ‌హేశ్వ‌ర‌రావు అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.... కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో అన్ని ప‌నుల్లోనూ అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించారని అన్నారు. ప‌నుల‌న్నింటినీ ప‌క్క‌న పెట్టేసి, సొంత ప్ర‌యోజ‌నాల‌ను చూసుకున్నార‌ని ఆరోపించారు. అందుకే ఏపీలో ప్రాజెక్టులు స‌గంలోనే ఆగిపోయాయ‌ని చెప్పారు. గ‌తంలో వైఎస్సార్ పూర్తి చేసిన ప‌నుల‌ను ఇప్పుడు టీడీపీ ప్ర‌భుత్వం ప్రారంభిస్తోంద‌ని జ‌గ‌న్‌ ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. వైఎస్సార్ హ‌యాంలోనే అన్ని పనులు పూర్తి చేస్తే, తాము ఇప్పుడు 33 వేల కోట్ల రూపాయలు అవే ప‌నుల‌పై ఎందుకు ఖ‌ర్చు పెట్టాల్సి వస్తుంద‌ని ప్ర‌శ్నించారు.

జ‌గ‌న్‌ రాష్ట్ర ప్ర‌జ‌ల సొమ్ములు దోచుకున్నాడ‌ని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు అన్నారు. సీబీఐ కేసుల్లో జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డి ఏ1, ఏ2 నిందితులుగా ఉన్నారని అన్నారు. అటువంటి అవినీతి నాయ‌కులు తాము చేస్తోన్న మంచి ప‌నులను విమ‌ర్శిస్తున్నారని మండిప‌డ్డారు. ఇప్పుడు జ‌గ‌న్ ప‌క్క‌న ఉన్న న‌లుగురు నేత‌లు గ‌త కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని, వారు చేయ‌లేని ప‌నుల‌ను త‌మ ప్ర‌భుత్వం ఇప్పుడు చేస్తోంద‌ని అన్నారు. ప‌ట్టిసీమ ఏడాది లోపు పూర్తి చేస్తే రాజీనామా చేస్తామ‌ని కొంద‌రు అన్నార‌ని, పులివెందుల‌కు నీళ్లు ఇస్తామంటే ఎగ‌తాళి చేశారని వ్యాఖ్యానించారు. తాము ఆ ప‌నులను చేసి చూపించామ‌ని ఉద్ఘాటించారు.  

  • Loading...

More Telugu News