: ఒకరి తర్వాత ఒకరు.. ఎనిమిది నెలల్లో ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి... వీడని మిస్టరీ!
తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లా తందరాయ్ లో ఓ కుటుంబంలో ఎనిమిది నెలల క్రితం మొదలైన మరణాలు ఇప్పటికీ ఆగలేదు. తాజాగా సోమవారం కూడా ఒకరు మరణించారు. 2016 అక్టోబర్ 7న క్రిస్టోఫర్ అనే 13 ఏళ్ల బాలుడు మృతి చెందగా, ఆ తర్వాత వరుసగా ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సరాన్ (4) తిరువణ్ణామలై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
జ్వరంతో సరాన్ మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరినట్టు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ తెలిపారు. ఆదివారం ఉదయం వరకు అంతా బాగానే ఉందని, ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని, ఉన్నట్టుండి వాంతులు మొదలయ్యాయని వివరించారు. సరాన్ మృతికి డెంగ్యూ కారణం కావచ్చన్నారు. నిజానికి గతంలో ఇదే కుటుంబంలో మరణించిన క్రిస్టోఫర్, వినోద్ కుమార్ (23), నెల్సన్ (11), క్రితికా మెర్లిన్ (7), జోసెఫ్ (70), క్రిస్టినా (65) కూడా వాంతులతో మరణించడం గమనార్హం.