: లోకేశ్ అందరినీ కసురుకుంటున్నారు.. ఒరేయ్ అంటూ మాట్లాడుతున్నారు: రోజా
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఈ రోజు హైదరాబాద్‌లోని తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ‘అడ్డదారిలో మంత్రి అయిన లోకేశ్‌కి అసలు ఓపిక లేకుండాపోతోంది. ఎవ్వరు మాట్లాడినా వారిపై కసురుకుంటున్నారు.. ఒరేయ్ అంటూ మాట్లాడుతున్నారు, వారిని దబాయిస్తున్నారు. ఇది మనం ప్రతిరోజు చూస్తున్నాం. అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పుకున్న టీడీపీ అధికారంలోకి వచ్చి 37 నెలలు అయింది. అంటే రాష్ట్రంలోని ఒక్కో నిరుద్యోగికి 74 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది’ అని రోజా వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడంలో పీజీ చేశాడని, లోకేశ్ ఏకంగా పీహెచ్‌డీ చేశారని రోజా ఎద్దేవా చేశారు. రాయలసీమలో ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని లోకేశ్ అంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ రోజు ఏదో జరిగిపోయినట్లు, అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లు మాట్లాడుతున్నారని తెలిపారు.