: వచ్చే ఏడాది చేయడానికి అవకాశాలు ఉండవు... ఏం చేసినా ఇప్పుడే చేయండి: చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ మధ్య మరింత సమన్వయం తేవడమే లక్ష్యంగా అమరావతిలో ఈ ఉదయం సమావేశం జరుగగా, సీఎం చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సంవత్సరం అభివృద్ధి చేసే అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం వంటివి చాలా తక్కువగా ఉంటాయని మంత్రులు, అధికారులకు చెప్పిన చంద్రబాబు, ఇప్పటికే ప్రారంభించిన పనులనన్నింటినీ ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
2018 ముగిసేలోగా అన్ని అభివృద్ధి పనులూ పూర్తి కావాలని సూచించిన ఆయన, ఆపై 2019 ఎన్నికల సంవత్సరమని గుర్తు చేశారు. 2018 అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి అత్యంత కీలకం కానుందని, ఏ మాత్రం అలసత్వం, నిర్లక్ష్యం చూపకుండా కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. అనుకున్న లక్ష్యాలన్నీ వచ్చే 12 నెలల కాలంలో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మంత్రులు, ప్రజా ప్రతినిధులదేనని స్పష్టం చేశారు. ఇందుకోసం జన్మభూమి కమిటీ సభ్యుల నుంచి మంత్రుల వరకూ ప్రతి ఒక్కరూ శ్రమించాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు. తాను పనితీరును, పురోగతిని విశ్లేషిస్తుంటానని, వాటి ప్రాతిపదికనే పదవులు వరిస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.