: ఎంతమాత్రమూ తగ్గని వర్షం... ప్రధాన నగరాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్!


నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ వంటి నగరాల్లో వర్షపు నీరు రోడ్లపై రెండు నుంచి మూడు అడుగుల మేరకు చేరగా, గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ఈ ఉదయం ఆఫీసులకు బయలుదేరిన వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.

హైదరాబాద్ లో మియాపూర్ నుంచి కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్ నుంచి కోటి రహదారులతో పాటు అమీర్ పేట, పంజాగుట్ట మధ్య వాహనాలు బారులు తీరి నిలిచిపోయాయి. విజయవాడలో సింగ్ నగర్, బీసెంట్ రోడ్, కృష్ణలంక తదితర ప్రాంతాల్లోనూ వాహనాలు నిలిచిపోయాయి. పలు గ్రామాలు, పట్టణాల్లోని ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఎమర్జెన్సీ టీములన్నింటినీ రంగంలోకి దించామని అధికారులు వెల్లడించారు. మ్యాన్ హోల్స్ దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అబిడ్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో చెట్లు కూలడంతో భారీగా ట్రాఫిక్ నిలిచింది.

కాగా, వర్షాల కారణంగా భారీగా నీరు వచ్చి చేరడంతో హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. ఈ జలాశయంలో గరిష్ఠ నీటిమట్టం 513.41 మీటర్లు కాగా, ఇప్పటికే 513.13 మీటర్ల ఎత్తునకు నీరు చేరింది. నీటి ప్రవాహాన్ని బట్టి హుస్సేన్ సాగర్ గేట్లను ఈ సాయంత్రానికి ఎత్తే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఆఘమేఘాల మీద సాగర్ నీరు వెళ్లే మార్గంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.

  • Loading...

More Telugu News