: పన్ను చెల్లించే వారికోసం ఆదాయపు పన్ను శాఖ యాప్!
ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం `మై ట్యాక్స్ యాప్`ను రూపొందించినట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. త్వరలోనే విడుదల చేయబోయే ఈ యాప్ ద్వారా ఆదాయపు పన్నుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే ఎంత పన్ను చెల్లించారు?, పన్ను చెల్లింపు విషయంలో వచ్చే ఇబ్బందులపై ఫిర్యాదులు కూడా ఈ యాప్ ద్వారా చేయవచ్చని తెలిపింది. వ్యక్తిగత పాన్ నెంబర్ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది.
ఇప్పటికే పన్ను చెల్లించడానికి, పాన్, టాన్ దరఖాస్తు చేయడానికి `ఆయకార్ సేతు` పేరుతో ఆదాయపు పన్నుశాఖ యాప్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ యాప్ అందరికీ ఒకేలా పనిచేస్తుంది. దీనితో పోలిస్తే `మై ట్యాక్స్ యాప్` మరింత వ్యక్తిగతంగా పనిచేస్తుంది. దీనికి పర్సనలైజ్డ్ లాగిన్ వివరాలు, సెక్యూరిటీ సదుపాయాలు వుంటాయి. పన్ను చెల్లించేవారిని కూడా వినియోగదారులుగా చూడాలంటూ చెప్పిన పార్థసారథి షోమ్ కమిటీ సూచనల మేరకు పన్ను వ్యవహారాల్లో సంస్కరణల పనిని ఐటీ శాఖ ముమ్మరం చేస్తోంది.