: దశాబ్దాలుగా ఆడుతున్న షారుక్ సినిమాను ఆపేసిన శ్రద్ధా కపూర్!
శ్రద్ధా కపూర్ సినిమా `హసీనా పార్కర్` ట్రైలర్ చూపించడం కోసం బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సినిమాను ఆపేశారు ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్ యాజమాన్యం. 1995 నుంచి ఇప్పటివరకు షారుక్ ఖాన్ సినిమా `దిల్ వాలే దుల్హానియ లేజాయేంగే` సినిమాను నిరంతరాయంగా ఈ థియేటర్‌లో ప్రదర్శిస్తున్నారు. కానీ `హసీనా పార్కర్` ట్రైలర్ ప్రదర్శించడం కోసం `డీడీఎల్‌జే` మాట్నీ షోను రద్దు చేశారు.
హసీనా, ఆమె సోదరుడు దావూద్ ఈ థియేటర్ ఉండే డోంగ్రీ ప్రాంతానికి చెందిన వారు కావడమే దీనికి కారణం. ఈ విషయాన్ని థియేటర్ వారే స్వయంగా స్పష్టం చేశారు. ట్రైలర్ ప్రదర్శన కోసం ఒకరోజు డీడీఎల్‌జే ప్రదర్శన ఆపాలని `హసీనా పార్కర్` నిర్మాతలు కోరినట్లు వారు తెలిపారు. అపూర్వ లాఖియా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హసీనా పార్కర్‌గా `శ్రద్ధా కపూర్`, ఆమె సోదరుడు దావూద్ ఇబ్రహీంగా స్వయాన శ్రద్ధా సోదరుడు `సిద్ధాంత్ కపూర్` నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 18న విడుదలకానుంది.