: బీహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక నిర్ణయం నేడు!
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ భవితవ్యం నేడు తేలిపోనుంది. ఆయన్ను ఉప ముఖ్యమంత్రి పదవిలో కొనసాగించే విషయమై రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. లాలు చిన్న కుమారుడైన తేజశ్విపై సీబీఐ ఇటీవల కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2004 తర్వాత లాలూ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్ సీటీసీ హోటళ్ల లీజులో అక్రమాలకు పాల్పడినట్టు, ఈ విషయంలో ఆయన కుటుంబానికి లబ్ధి కలిగిందన్న ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. దీంతో తేజశ్వి యాదవ్ పదవి నుంచి స్వచ్చందంగా తప్పుకుంటారని నితీశ్ కుమార్ ఆశించారు. అయితే, తేజశ్వి తప్పుకునే అవకాశమే లేదని ఆయన తండ్రి లాలూ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో అవినీతి విషయంలో కఠినంగా వ్యవహరించే నితీశ్ కుమార్ లాలూ చిన్న కుమారుడిని సాగనంపుతారా, లేక మరో నిర్ణయం తీసుకుంటారా అన్నది నేడు తేలిపోతుంది.