: సరిహద్దులో ఉత్కంఠ... భారత్, చైనా సైనికుల మధ్య దూరం 500 మీటర్లే!
డోక్లాం సరిహద్దు ప్రాంతంలో గత 30 రోజులుగా భారత్, చైనా సైనికుల మధ్య దూరం దాదాపు 500 మీటర్లుగానే ఉంటుంది. ఒకరినొకరు 24 గంటల పాటు గమనిస్తూనే ఉన్నారు. నాథులా కనుమ నుంచి ఇది 15 కి.మీ.ల దూరంలో ఉంది. ఎప్పుడు ఏం జరగనుందో తెలియక, ఒక స్థానంలో ప్రతి రెండు గంటలకు ఒకరు చొప్పున సైనికులు 24 గం.ల పాటు సరిహద్దు మొత్తం గస్తీ కాస్తున్నారు. జూన్ 6 నుంచి కొనసాగుతున్న ఈ డోక్లాం వివాదం సద్దుమణిగేలా చేయడం కోసం భారత్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. బీజింగ్‌తో దౌత్య ఒప్పందం చేసుకునేందుకు కూడా భారత్ యత్నిస్తోంది. సరిహద్దు వద్ద చైనా వైపు 3000ల మంది సైనిక దళం, వారి తర్వాత యుద్ధనౌకలు ఉన్నట్టు యూఏవీ (అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్) సర్వేలో తెలిసింది. దీన్ని బట్టి చూస్తే భారత దేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ప్రాంతంలో ఉన్న జంపారీ పర్వతశ్రేణి పైనే చైనా గురి ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ వివాదం గురించి పార్లమెంట్‌లో చర్చను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేవనెత్తనున్నారు. `ఈ వివాదంలో ఎక్కువగా నష్టపోయేది బెంగాలే! ఒకవేళ సిక్కిం గనక చైనా వశమైతే, వారి తర్వాతి గురి డార్జిలింగ్ పైనే ఉంటుంది. చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ దేశాలతో భారత దేశ అసంపూర్ణ దౌత్య విధానాల్లో బెంగాల్ బలిపశువుగా మారుతోంది` అని మమతా బెనర్జీ తెలిపారు. ఇదిలా ఉండగా చైనా మాత్రం టిబెట్ సరిహద్దులో మిలటరీ విన్యాసాలు ప్రదర్శిస్తోంది.