: వెంకయ్య నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు వెళ్లడం లేదు!
మరికాసేపట్లో ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా నామినేషన్ వేయనుండగా, ఆ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కావడం లేదు. ఆయన ఢిల్లీ పర్యటన రద్దు అయింది. నిన్న వెంకయ్యనాయుడు పేరును అమిత్ షా వెల్లడించిన తరువాత, ఆయనకు స్వయంగా ఫోన్ చేసి అభినందించిన చంద్రబాబు, ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ ఉదయం ఢిల్లీకి చంద్రబాబు బయలుదేరాల్సి వుండగా, పర్యటన రద్దు అయిందని, ముందుగా అనుకున్న క్యాబినెట్ సమావేశం యథావిధిగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కాగా, నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించలేదని, అందువల్లే ఆయన ఢిల్లీ ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఉండవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ కారణంతో బాబు పర్యటన రద్దు అయిందన్న విషయమై సీఎం కార్యాలయం ఇంకా వివరణ ఇవ్వలేదు.