: పైన ప్రాజెక్టులు కళావిహీనం... రాజమండ్రి వద్ద వృథాగా పోతున్న వరదనీరు!
గత రెండు రోజులుగా చత్తీస్ గఢ్, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం వద్ద గోదావరి నదిలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. నదిపై ఉన్న శ్రీరాంసాగర్ వంటి ప్రాజెక్టులు ఖాళీగా కనిపిస్తున్నప్పటికీ, దిగువ ప్రాంతాల్లో వర్షాలతో గోదావరికి జలకళ రాగా, ఈ ఉదయం ప్రాజెక్టు నుంచి 85 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. ప్రధాన పంట కాలువలకు 4,100 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని అధికారులు తెలిపారు.
కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురవడం లేదని, ఆ కారణంగా గోదావరి, కృష్ణానదుల ఎగువ ప్రాంతాల్లో వరద ఛాయలు లేవని అధికారులు చెబుతున్నారు. ఈ ఉదయం ఆల్మట్టి ప్రాజెక్టుకు 27,447 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదవుతుండగా, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు చుక్క నీరు రావడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1,306, నాగార్జున సాగర్ కు 4,238 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.