: నాపై అథ్లెట్ అత్యాచారం: సంచలన ఆరోపణతో పోలీసులను ఆశ్రయించిన జాతీయ కబడ్డీ క్రీడాకారిణి
జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణిగా రాణిస్తున్న 16 ఏళ్ల యువ క్రీడాకారిణి, తనపై అత్యాచారం జరిగిందంటూ నార్త్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం కలిగిస్తోంది. ఈ నెల 9వ తేదీన, ఓ క్రీడాకారుడు తనను రేప్ చేశాడని, తాను స్పృహలో లేని సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది. తనకు ఏం జరిగిందో గుర్తు రావడం లేదని, ఓ పెద్ద గదిలో తాను అత్యాచారానికి గురైనట్టు మాత్రమే తెలుస్తోందని వెల్లడించింది.
దీనిపై విచారించిన పోలీసులు, సీసీటీవీ కెమెరాలను విశ్లేషించిన తరువాత, సదరు ఆటగాడు, బాధితురాలిని కారులో ఛత్రసల్ మైదానం నుంచి తీసుకెళ్లాడని తేల్చారు. ఆపై జూలై 10న ఆమెను ఓ బస్టాండ్ వద్ద వదిలేశాడని పోలీసు అధికారులు తెలిపారు. కాగా, అతడు ఇచ్చిన ఆహారం, పానీయాలు తీసుకున్న తాను స్పృహ కోల్పోయానని, తొలుత జరిగిన దురాగతాన్ని ఎవరికైనా చెప్పేందుకు భయపడ్డానని, చివరికి పోలీసులను ఆశ్రయించానని ఆమె పేర్కొంది. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించామని, కేసును విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.