: వాగ్ధాటిలో ఆయనకు ఆయనే సాటి.. ఆయనకెవరూ లేరు పోటీ.. రాజకీయాలకు వన్నె తెచ్చిన వెంకయ్య!


ముప్పవరపు వెంకయ్యనాయుడు.. భారత రాజకీయాల్లో ఈ పేరో సంచలనం. దేశ రాజకీయాలపై సంపూర్ణ పట్టు ఉన్న బీజేపీ అగ్రనేత. పార్టీ సమస్యల్లో చిక్కుకున్నప్పుడు చాకచక్యంతో బయటపడేసిన అందిరి నేత. నెల్లూరు జిల్లాలో సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఆటుపోట్లను తట్టుకుని దేశ రాజకీయాల్లోనే కీలక నేతగా ఎదిగారు. విద్యార్థి నేతగా ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీలో ఒకప్పుడు అగ్రనేతలు వాజ్‌పేయి, అద్వాణీల వాల్‌పోస్టర్లు అతికించిన వెంకయ్యనాయుడు నేడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి స్థాయికి ఎదిగారు. సమకాలీన రాజకీయాల్లో వెంకయ్య చెరగని ముద్రవేశారు. చక్కని వాక్పటిమ ఆయన సొంతం. అంతేకాదు.. ఆయనైతేనే ఆ పదవికి వన్నె తేగలరని ఎన్డీఏ పక్షాలు ముక్త  కంఠంతో చెబుతుండడం విశేషం.

చందాలతో గెలిపించుకున్నారు..

అది 1983. ఎన్టీఆర్ పేరు రాష్ట్రంలో మార్మోగుతోంది. ఎన్టీఆర్ ప్రభంజనంతో చాలామంది ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా భయపడ్డారు. కానీ అటువంటి సమయంలోనూ వెంకయ్యనాయుడు ఉదయగిరి నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఏనాడూ వెంకయ్య పక్క పార్టీలవైపు చూడలేదు. నిరంతరం పార్టీ కోసం శ్రమించారు. ఎమ్మెల్యేగా తొలిసారి పోటీచేసినప్పుడు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు చందాలు వేసుకుని మరీ ఆయనకు మద్దతు తెలిపారు.  

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు..

అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో వెంకయ్య జైలుకు వెళ్లారు. అవినీతికి వ్యతిరేకంగా సోషలిస్ట్ నేత జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన ఛత్ర సంఘర్ష్ సమితికి వెంకయ్యనాయుడు 1974లో ఆంధ్రప్రదేశ్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. 1977లో జనతా పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాతి నుంచి ఆయన గ్రాఫ్ పెరుగుతూ పోయింది. ఉదయగిరి నియోజకవర్గం నుంచి 1978, 1983లలో రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. అనంతరం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి తనదైన ముద్రవేశారు. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార శాఖామంత్రిగా ఉన్నారు. కేంద్రంలో తెలుగు ప్రజలకు ఉన్న ఒకే ఒక్క పెద్ద దిక్కు వెంకయ్యే!

  • Loading...

More Telugu News