: ఆనందంగా ఉంటుంది.. లోటుగానూ ఉంటుంది: సీఎం చంద్రబాబు
ఎన్డీఏ తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడిని ఎంపిక చేసిన విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనకు ఫోన్ చేసి చెప్పారని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు ఆనందంగా ఉంటుందని అన్నారు. అయితే, అంత అనుభవజ్ఞుడైన నేత, మనకు అండగా ఉండే వ్యక్తి మనకు దూరమవుతుంటే కొంత లోటుగా కూడా ఉంటుందని అన్నారు. అయితే, ఒక వ్యక్తికి ప్రమోషన్ వచ్చినప్పుడు, ఉన్నత పదవులు వచ్చినప్పుడు ఆహ్వానించి ముందుకు వెళ్లాలని అన్నారు.
ఇన్నాళ్లూ ఎంతో అండగా ఉన్న వెంకయ్యనాయుడుకి తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఉప రాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఆయన హెల్ప్ చేయడానికి పెద్ద ఆటంకం ఉంటుందని తాను అనుకోవట్లేదని అన్నారు. అయితే, ఉపరాష్ట్రపదవిలో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది ఉంటుందని అన్నారు.‘రాజకీయాల గురించి మాట్లాడే వ్యక్తి, ఉన్నపళంగా పాలిటిక్స్ వదులుకోవాలంటే కొంచెం ఇబ్బంది. వెంకయ్యనాయుడు గారి జీవనం మొత్తం పాలిటిక్స్. అలాంటి వ్యక్తి ఉన్నపళంగా రాజకీయాలను కట్ చేసుకోవాలంటే చాలా సమస్యలు ఉంటాయి. చాలా కంట్రోల్ చేసుకోవాలి.. ఆయనకు ఇది ఒక పెద్ద పరీక్ష, ఈ పరీక్షలో ఆయన పాసవుతాడు. దాని గురించి అనుమానం లేదు’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.