: ఉపరాష్ట్రపతి రేసులో వెంకయ్య, విద్యాసాగర్!
బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును ఎంపిక చేసే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు ప్రసారమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ వెంట నడుస్తూ ప్రచారంలో చేదోడు వాదోడుగా ఉంటున్న వెంకయ్యనాయుడునే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలున్నాయని ఈ కథనాల సారాంశం. దక్షిణాదికి చెందిన వెంకయ్యనాయుడుని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం వల్ల బీజేపీకి దక్షిణాదిలో పట్టు సాధించే అవకాశం దొరుకుతుంది.
మరోవైపు తన కేబినెట్లో మంత్రులను వదులుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించని ప్రధాని మోదీ, వెంకయ్యనాయుడుని ఎలా వదులుకుంటారనే సందేహం కూడా తలెత్తుతోంది. ఈ విషయంపై వెంకయ్యనాయుడు స్పందిస్తూ తనకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి పదవుల మీద ఆశ లేదని, ఎప్పటికీ తన భార్య ఉషకు మాత్రమే పతిగా ఉంటానని చెప్పారు. ఇదిలా ఉండగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో సీహెచ్ విద్యాసాగర్ రావు పేరు కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు? అనే విషయంపై సోమవారం సాయంత్రం 6 గంటలకు స్పష్టత రానుంది.