: మెలానియాకు విదేశీ పర్యటనల మేనియా!
అమెరికా ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్‌కు ఇతర దేశాల్లో పర్యటించడమంటే బాగా ఇష్టమున్నట్లు ఉంది. అందుకే డొనాల్డ్ ట్రంప్ వెళ్లే ప్రతి విదేశీ పర్యటనకు ఆమె బ్యాగు సర్దుకొని సిద్ధంగా ఉంటుంది. అంతేకాకుండా ట్రంప్ రాకున్నా కూడా ఆమే స్వయంగా విదేశాలు చుట్టొచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో స్వదేశం కంటే విదేశాల మీదే మెలానియాకు మమకారం ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. భర్తతో కలిసి విదేశాల్లో పర్యటించడమే కాదు అక్కడ నిర్వహించే కార్యక్రమాల్లో మెలానియా తన వంతు ప్రసంగాలు కూడా ఇస్తుంది. అలాగే ఆయా దేశాల్లో సామాజిక సేవాకార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో గమనిస్తే తన స్వదేశం అమెరికాలో మెలానియా ప్రసంగాలు ఇచ్చిన దాఖలాలు గానీ, సేవాకార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితులు గానీ పెద్దగా కనిపించవు.
స్లోవేనియాలో జన్మించిన మెలానియా ఆరు అంతర్జాతీయ భాషలు గలగలా మాట్లాడుతుంది. ఇటలీ వెళ్లినపుడు ఇటాలియన్‌లో, ఫ్రాన్స్ వెళ్లినపుడు ఫ్రెంచ్‌లో మాట్లాడి అందర్నీ ఆకట్టుకునే మెలానియాను తనతో పాటు తీసుకెళ్లడానికి ట్రంప్ కూడా మొగ్గు చూపుతారని వైట్ హౌస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మాజీ ప్రథమ పౌరురాలు మిషెల్ ఒబామా ఎక్కువగా తమ దేశ సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించేది. అందుకు భిన్నంగా మెలానియా ఇతర దేశాల సమస్యలపై దృష్టి సారించడంపై అమెరికన్లు ఒకింత సంతోషంగానే ఉన్నారని అమెరికా నేషనల్ ట్యాక్స్ పేయర్స్ అంచనాలో తేలింది.