: అమ్మాయిలు ధరించే దుస్తులపై నటుడు చలపతి రావు వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవలే అమ్మాయిలపై వెకిలి వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కున్న సీనియర్ నటుడు చలపతి రావు మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేశారు. ఇటీవలే ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చలపతిరావు మాట్లాడుతూ... ఆడపిల్లలు వేసుకుంటున్న దుస్తులపై కామెంట్లు చేశారు. ఈ కాలంలో అమ్మాయిలు ఫ్యాంటు, టీషర్టు వేసుకుంటే తప్పని తాను అనడం లేదని వ్యాఖ్యానించిన చలపతి రావు... గతంలోనైతే ఓణీలు వేసుకునేవారని అన్నారు. ఇప్పటి అమ్మాయిలు మాత్రం ఆ ఓణీలు ఎందుకు వేసుకుంటారో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు.
మరోవైపు చున్నీలను తలకు, మెడకు చుట్టుకుంటున్నారని, ఎక్కడ వేసుకోవాలో కూడా తెలియడం లేదని అన్నారు. ఇటువంటి అమ్మాయిలకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. వారికి అది తప్పు అని చెప్పాలని చూస్తే.. అందుకు ప్రయత్నించిన వ్యక్తిని చాదస్తపరుడు, ముసలోడు అని అంటారని అన్నారు. అమ్మాయిలు చున్నీని మెడకి లేదా తలకో చుట్టుకుని వెళ్లినపుడు వారిని చూసిన కుర్రాళ్లు కామెంట్ చేస్తారని, ఇక అమ్మాయిలకు ఓపిక ఉంటే ఆ యువకులతో దెబ్బలాడతారని, లేదంటే సైలెంట్‌గా వెళ్లిపోతారని అన్నారు. ఇటువంటి దుస్తులు ధరించి జీవితాంతం ఇలాగే దెబ్బలాడే పరిస్థితి ఎందుకని ప్రశ్నించారు.