: వైసీపీ వాళ్లు కూడా నా వద్దకు వచ్చి పనులు చేయించుకుంటున్నారు: రోజా వ్యాఖ్యలపై స్పీకర్ కోడెల స్పందన
వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మరోసారి ప్రివిలేజ్ నోటీసులు జారీ కాబోతున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ సందర్భంగా రాజకీయ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, మరోసారి రోజా వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేలతో కలసి ముఖ్యమంత్రి మాక్ పోలింగ్ నిర్వహించారని, స్పీకర్ కూడా దానికి సహకరించారని, ఆయన దిగజారి ప్రవర్తించారంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానిపై స్పీకర్ సీరియస్ గా స్పందించారు.
తాను స్పీకర్ స్థానానికి మచ్చ తెచ్చేలా ఎన్నడూ ప్రవర్తించలేదని కోడెల అన్నారు. తన ప్రవర్తన స్పీకర్ పదవికి వన్నె తెచ్చేలా ఉందని తెలిపారు. రాష్ట్రంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు తాను హాజరవుతుంటానని... వైసీపీ నేతలు కూడా తన వద్దకు వచ్చి పనులు చేయించుకుంటుంటారని చెప్పారు. తనకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సమానమేనని... ఒకర్ని ఎక్కువగా, మరొకర్ని తక్కువగా తాను చూడనని అన్నారు. ఓటింగ్ సందర్భంగా తాను టీడీఎల్సీ కార్యాలయానికి వెళ్లలేదని... ముఖ్యమంత్రికి, తనకు ఓటు ఎలా వేయాలో నా కార్యాలయం ఎదుటే అధికారులు సూచనలు చేశారని చెప్పారు.