: టీసీఎస్ ను వదిలిపెట్టం, వెళ్లేందుకు అనుమతించం!: తేల్చి చెప్పిన యూపీ సర్కారు
లక్నోలోని తమ కార్యాలయాన్ని మూసేస్తున్నామని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చేసిన ప్రకటన, ఉద్యోగుల్లో ఆందోళనకు కారణం కాగా, యోగి ఆదిత్యనాథ్ సర్కారు స్పందించింది. సంస్థ లక్నో యూనిట్ ను మూసివేసేందుకు తాము అనుమతించబోమని, ఏమైనా సమస్యలు ఉంటే తీర్చేందుకు కృషి చేస్తామని, ఈ మేరకు టీసీఎస్ అధికారులతో సంప్రదిస్తున్నామని రాష్ట్ర ఆర్థికమంత్రి రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. రాష్ట్రాన్ని విడిచి వెళ్లేందుకు తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు.
ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి వున్నామని తెలిపిన ఆయన, విషయాన్ని పరిశీలించాలని కార్మిక, ఉపాధి కల్పనా శాఖల మంత్రి మౌర్యకు సూచించినట్టు తెలిపారు. కాగా, ఈ కార్యాలయం మూసేస్తే, తమకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయన్న ఆందోళన వ్యక్తం చేస్తూ, పలువురు ఉద్యోగులు ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించి, ఉద్యోగులకు ఊరట కలిగించే వ్యాఖ్యలు చేసింది.