: భారత్‌లో జీ20 సమావేశాలు ఇప్పట్లో కష్టమే!
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సమావేశ కేంద్రం లేకపోవడం, 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడం వంటి కారణాలతో ఇప్పట్లో జీ20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వలేకపోతోంది. నిజానికి 2018, 2019 సంవత్సరాల్లో జీ20 సమావేశాలు భారత్‌లో నిర్వహించాలని ప్రధాని మోదీ అనుకున్నారు. కానీ 2018 జీ20 సమావేశాల ఆతిథ్యాన్ని వదులుకోవడానికి అర్జంటీనా దేశం సుముఖంగా లేకపోవడం, అలాగే ఇంత తక్కువ సమయంలో సమావేశాలకు కావాలసిన అవస్థాపనా సౌకర్యాలు, రక్షణ సౌకర్యాలు కల్పించడం కుదరకపోవడంతో 2019కి వాయిదా వేశారు. కానీ 2019లో పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఆ ఏడాది కూడా జీ20కి ఆతిథ్యం ఇచ్చే ఆశ వదులుకున్నారు. దీంతో 2019 సమావేశాలను జపాన్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.
జీ20 సమావేశాలు నిర్వహించాలంటే ఆషామాషీ విషయం కాదు. 19 దేశాల ప్రతినిధులకు రక్షణ సౌకర్యాలు, సమావేశానికి సరిపడే వేదిక, ప్రతినిధులకు, అంతర్జాతీయ జర్నలిస్టులకు కావాల్సిన సౌకర్యాలు చూసుకోవాల్సి ఉంటుంది. అందుకు తగిన వేదిక గానీ, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన సమావేశ మందిరాలు కానీ భారత్‌లో లేవు. దీంతో 2020లో అవస్థాపనా సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లు చూసుకుని 2021లో గానీ, 2022లో గానీ జీ20 సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్టు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.