: ప్రపంచంలోనే ఆనంద నగరంగా అమరావతి: పీటీఐ ఇంటర్వ్యూలో చంద్రబాబు

జీవనది కృష్ణమ్మ చెంత నిర్మితమవుతున్న అమరావతి నగరం ప్రపంచంలోనే అత్యంత ఆనంద నగరాల్లో ఒకటిగా ఉంటుందని, ఇక్కడ నివసించేందుకు ప్రజలు అత్యంత ఆసక్తిని చూపేలా తయారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, హ్యాపీనెస్ ఇండెక్స్ లో అమరావతి టాప్ స్థానంలో ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నగర నిర్మాణానికి అమరావతి ప్రాంత రైతులు స్వచ్ఛందంగా 32,500 ఎకరాల భూమిని వినూత్నమైన ల్యాండ్ పూలింగ్ విధానంలో అందించారని గుర్తు చేసిన చంద్రబాబు, తనపై ప్రజలకున్న నమ్మకానికి ఇదే నిదర్శనమని తెలిపారు.

కష్టాలనే అవకాశాలుగా మలచుకుంటూ, నూతన రాజధాని నిర్మాణం నిమిత్తం తాను అడుగులు వేస్తున్నానని, ఓ స్వచ్ఛమైన హరిత నగరంగా అమరావతిని తయారు చేస్తామని తెలిపారు. నగరం మొత్తం నీటి లభ్యత ఉంటుందని, తటాకాలు, పార్కులతో ఉష్ణోగ్రతలు పెరగకుండా నియంత్రణలో ఉంచే విధానాన్ని అవలంబిస్తామని తెలియజేశారు. కృష్ణానదిలో పదమూడు ఐలాండ్ లు ఉన్నాయని, వాటిల్లో ఏడింటిని పర్యాటక ప్రదేశాలుగా మార్చాలని నిర్ణయించామని తెలిపారు. నగరంలో ఎక్కడా విద్యుత్ స్తంభాలు, మొబైల్ టవర్లూ కనిపించవని, అందుకోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఓ ప్రణాళికా బద్ధమైన నగరంగా అమరావతిని తయారు చేసి చూపిస్తామని, మొత్తం నగరంలో 30 శాతం నీటి ప్రవాహం ఉంటుందని తెలిపారు. వెలగపూడిలో తాత్కాలిక ప్రభుత్వ కాంప్లెక్స్ ను 192 రోజుల వ్యవధిలో పూర్తి చేశామని, ఇక్కడిప్పుడు 500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు.

More Telugu News