: ఎన్టీఆర్ 'బిగ్ బాస్'లో సిట్ నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు... సిట్ ముందు కొత్త తలనొప్పి!
ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా నిన్న ప్రారంభమైన తెలుగు వర్షన్ 'బిగ్ బాస్'లో టాలీవుడ్ ను కుదిపేసిన డ్రగ్స్ దందాలో ఇరుక్కున్న వారుండటం, సిట్ పోలీసులకు కొత్త తలనొప్పి తెచ్చి పెడుతోంది. ఈ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే ముమైత్ ఖాన్ కు నోటీసులు పంపినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన వారిలో మరో ఇద్దరికి కూడా ఈ దందాలో ప్రమేయం ఉందని, వారికి సెకండ్ లిస్టులో నోటీసులు పంపాల్సి వుందని సిట్ వర్గాల సమాచారం. వీరంతా బాహ్య ప్రపంచంతో 70 రోజుల పాటు సంబంధాలు లేకుండా హోస్ లోనే ఉండిపోవాల్సి వుండటంతో, వీరిని విచారించేందుకు మార్గమేంటన్నది పోలీసుల ముందున్న ప్రశ్న.
కాగా, నోటీసులు అందుకున్న వారు తాము చెప్పిన సమయానికి విచారణకు హాజరు కావాల్సిందేనని, తప్పనిసరైతే, తాము కల్పించుకుని వారిని హౌస్ నుంచి బయటకు తెచ్చి విచారిస్తామని సిట్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ముమైత్ ఖాన్ 21వ తేదీన పోలీసుల విచారణకు హాజరు కావాల్సి వుంది. ముమైత్ తో పాటు పూరీ జగన్నాథ్, చార్మీలను కూడా 21నే విచారించాలని సిట్ పోలీసులు నిర్ణయించుకున్నారు. మరి ముమైతే ఇప్పుడు హౌస్ లో ఉండటంతో పోలీసులు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.