: విమర్శలతో వెనక్కు తగ్గిన టీటీడీ... కాలినడక భక్తులకు కొత్త విధానంలో దర్శనం


తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వచ్చే భక్తులకు వారాంతంలో దివ్య దర్శనాన్ని కల్పించరాదని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చిన వేళ, అధికారులు వెనక్కు తగ్గారు. శుక్ర, శని, ఆదివారాల్లో సైతం దివ్యదర్శనం టికెట్లను జారీ చేస్తామని, రోజుకు 20 వేల మంది కాలినడక భక్తులకు సమయం కేటాయించి దర్శనం చేయిస్తామని తెలిపారు. ఈ మేరకు అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, తొలి భక్తుడికి టోకెన్లను ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అందించారు.

ఆదివారం రాత్రి 10.30 గంటలకు నడక ప్రారంభించిన వారికి, సోమవారం ఉదయం 8 గంటలకు దర్శనం కల్పించారు. ఇక, తొలి మెట్టు వద్దే ఈ టోకెన్లను తీసుకునే భక్తులు, దాన్ని గాలిగోపురం వద్ద మరోసారి స్కాన్ చేయించుకుని లడ్డూల స్టాంపును వేయించుకోవాల్సి వుంటుంది. ఆపై దానిపై ఉన్న సమయానుసారం దివ్యదర్శనం కాంప్లెక్సుకు చేరుకని రిపోర్టు చేస్తే, గరిష్ఠంగా రెండున్నర గంటల వ్యవధిలో దర్శనం కలుగుతుందని అధికారులు వెల్లడించారు. గతంలో కాలినడక భక్తులు 24 గంటల్లోపు ఎప్పుడైనా దర్శనానికి వెళ్లే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News