: విస్తారంగా వర్షాలు... తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్ద!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలోని అన్ని ప్రాంతాలు, రాయలసీమ, తెలంగాణల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రానున్న 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశాలు ఉండటంతో, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, ఒడిశా తీరాన్ని ఆనుకుని ఉందని, ఇది వాయుగుండంగా, తుపానుగా మారి ఒడిశా, ఏపీ మధ్య తీరాన్ని దాటవచ్చని వెల్లడించారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుండటంతో మరిన్ని వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.