: టీఆర్ఎస్ నాయకులైనా, మంత్రులైనా సరే ‘డ్రగ్స్’ కేసులో ఉంటే చర్యలు తీసుకోండి: కేసీఆర్ ఆదేశాలు


‘డ్రగ్స్’ కేసు వ్యవహారంలో టీఆర్ఎస్ నాయకులైనా, మంత్రులైనా సరే ఉంటే వదిలిపెట్టవద్దని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించవద్దని, చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎక్సైజ్, పోలీసు అధికారులతో ఈ రోజు కేసీఆర్ సుమారు మూడు గంటలపాటు భేటీ అయ్యారు. డ్రగ్స్ కేసు దర్యాప్తులో దూకుడు పెంచాలని, అధికార పార్టీకి చెందిన నాయకులు, మంత్రులకు కనుక ఈ వ్యవహారంతో సంబంధాలు ఉంటే తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.. హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకం, దందా ఎప్పటి నుంచో ఉన్నాయని, దీనిని పూర్తిగా రూపుమాపేందుకు అధికారులు కృషి చేయాలని, హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని, ఈ నగరం బ్రాండ్ ఇమేజ్ ను కాపాడాలని కేసీఆర్ సూచించారు.

హైదరాబాద్ లో డ్రగ్స్ అరాచకం అంతం కావాలని, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ను సెలవుపై వెళ్లొద్దని తానే సూచించానని, కేసు పూర్వాపరాలు వెలికితీయాలని ఆదేశించానని చెప్పారు. డ్రగ్స్, కల్తీలతో పాటు ఇతర సామాజిక రుగ్మతలకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ సమీక్షించినట్టు సమాచారం. ఆహార పదార్థాల కల్తీలు, రక్తం కల్తీ వ్యవహారంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అక్రమార్కులు భయపడేలా కఠిన చర్యలు ఉండాలని, హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.  

  • Loading...

More Telugu News