: శశికళ జైలు గదిలోని సీసీటీవీ రికార్డులు మాయం: కలకలం రేపుతున్న రూప రెండో నివేదిక
కర్ణాటక జైళ్ల శాఖ డిప్యూటి ఇనస్పెక్టర్ జనరల్ డీ రూప, ఇచ్చిన ఓ నివేదిక ఇప్పటికే పరప్పన అగ్రహార జైల్లో శశికళ అనుభవిస్తున్న సౌకర్యాలపై సంచలన నిజాలను వెలుగులోకి తేగా, ఆమె ఇచ్చిన రెండో నివేదిక మరింత దుమారాన్ని రేపుతోంది. జైళ్ల శాఖ డీజీపీ హెచ్ఎన్ సత్యనారాయణరావుకు ఆమె ఇచ్చిన తాజా నివేదికలో శశికళ జైలు గదికి సంబంధించిన సీసీటీవీ రికార్డింగ్స్ మాయం అయ్యాయని, ఆమెకు అందుకున్న వీఐపీ ట్రీట్ మెంట్, ఆమెను కలిసేందుకు వస్తున్న వారి వివరాలు తెలియకుండా పోయాయని ఆరోపించారు.
విజిటర్స్ గ్యాలరీలో రెండు సీసీటీవీ కెమెరాలు మాత్రమే పని చేస్తున్నాయని, అడ్మిషన్ రూములోని కెమెరా పని చేయడం లేదని, తనను కలిసేందుకు వచ్చిన వారితో శశికళ మాట్లాడిన గదిలో కెమెరాలు ఉన్నాయని, వాటి రికార్డింగ్స్ ను ఎవరో డిలీట్ చేశారని తన విచారణలో తేలిందని రూప ఈ నివేదికలో వెల్లడించారు. కాగా, రూ. 2 కోట్లను లంచంగా తీసుకున్న జైలు అధికారులు, శశికళకు సకల సౌకర్యాలనూ కల్పించారని రూప ఇచ్చిన తొలి నివేదిక కలకలం రేపగా, సత్యనారాయణరావు వాటిని ఖండించిన సంగతి తెలిసిందే.