: ధోవతి కట్టుకున్నాడని సినీ ప్రముఖుడికి మాల్ లోకి అనుమతి నిరాకరణ!
ఓ బెంగాలీ చిత్ర దర్శకుడు, ధోవతి కట్టుకుని మాల్ లోకి వెళ్లాలని ప్రయత్నించగా, అక్కడి సిబ్బంది అడ్డుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆశిష్ అవికుంథక్ అనే దర్శకుడు, తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కోల్ కతాలోని క్లబ్బులు, మాల్స్ లోకి ప్రవేశించేందుకు పలువురికి అనుమతి ఉండదన్నది వాస్తవమే అయినా, తనకు ఎదురైన అనుభవం వేరని, గత 26 ఏళ్లుగా తాను ధోవతులను ధరిస్తున్నానని, అదే డ్రస్సుతో మాల్ లోకి వెళ్లబోతే, లుంగీలు, ధోవతులతో ప్రవేశించేందుకు వీలు లేదని, భధ్రతా పరమైన నిబంధనలను చెబుతూ తనను అడ్డుకున్నారని ఆశిష్ వెల్లడించారు.
ఆపై తాను ఇంగ్లీషులో మాట్లాడుతూ, తానెవరో చెబితే అనుమతించారని పేర్కొన్నారు. ఇదే విషయమై మాల్ యాజమాన్యం స్పందిస్తూ, సదరు వ్యక్తి కేవలం 20 సెకన్లు మాత్రమే నిరీక్షించాల్సి వచ్చిందని, అందుకు సంబంధించిన వీడియో కూడా ఉందని, అతన్ని అడ్డుకున్నామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. సూపర్ వైజర్ అభిప్రాయాన్ని అడిగేందుకు మాత్రమే సెక్యూరిటీ గార్డు ఆశిష్ ను కొన్ని క్షణాలు నిలిపాడని స్పష్టం చేశారు.