: భారత్‌లో ప్రతి 10 మందిలో ఆరుగురు డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందుతున్నారో తెలుసా?.. అధ్యయనంలో విస్తుపోయే నిజాలు వెల్లడి!

దేశంలో ప్రతి పది మందిలో ఆరుగురు ఎటువంటి పరీక్షలు లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందుతున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. దేశంలోని ఐదు మెట్రో నగరాలు సహా పది నగరాల్లో నిర్వహించిన ఈ శాంపిల్ సర్వేలో విస్తుబోయే నిజాలు వెల్లడయ్యాయి. మోటార్ వెహికల్ చట్టంలోని సవరణలపై రాజస్యభ చర్చించనున్న నేపథ్యంలో తాజా సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆగ్రాలో కేవలం 12 శాతం మంది మాత్రమే నిజాయతీగా లైసెన్స్ పొందుతున్నారు. సర్వేలో  పాల్గొన్నవారిలో 88 శాతం మంది తాము ఎటువంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ పొందినట్టు తెలిపారు. జైపూర్‌లో 72 శాతం మంది, గువాహటిలో 64 శాతం మంది డ్రైవింగ్ టెస్ట్‌లకు హాజరుకాకుండానే లైసెన్స్ తీసుకున్నారు. ఢిల్లీలో 54 శాతం మంది, ముంబైలో సగం మంది కూడా డ్రైవింగ్ లైసెన్స్ కోసం తప్పనిసరి టెస్ట్‌ల కోసం హాజరుకావడం లేదు. రోడ్ సేఫ్టీ అడ్వొకసీ గ్రూప్ ‘సేవ్ లైఫ్ ఫౌండేషన్’ ఈ సర్వే నిర్వహించింది.

కాగా, మోటార్ వెహికల్ చట్టం సవరణల్లో భాగంగా ఐటీ ఆధారిత డ్రైవింగ్ టెస్ట్‌‌ల గురించి కూడా రాజ్యసభలో చర్చించనున్నారు. నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగినా, ఒకటి కంటే ఎక్కువ లైసెన్స్‌లు ఉన్నా భారీ జరిమానా విధించే అంశం రాజ్యసభలో చర్చకు రానుంది. రోడ్డు భద్రతపై చాలామంది ఆందోళనగా ఉన్నారని సేవ్ లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పీయూష్ తివారీ పేర్కొన్నారు. అయితే రోడ్ సేఫ్టీ చట్టాల కారణంగా పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని చాలామంది అభిప్రాయపడినట్టు ఆయన పేర్కొన్నారు.

More Telugu News