: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గౌరవార్థం మ్యూజియం.. ఈనెల 27న ప్రారంభం
భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గౌరవార్థం నిర్మించిన మ్యూజియంను ఈనెల 27న ప్రారంభించనున్నారు. తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని పీకరంబూర్‌లో 3.45 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో ఓ ప్లానెటోరియం (నక్షత్రశాల) కూడా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పనులను కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఈ మ్యూజియం స్ఫూర్తి నిస్తుందన్నారు. అందరికీ ఇదో పవిత్ర స్థలంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. మత్స్యకారుల బోట్ల సమస్యపై మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకం కింద తమిళనాడుకు 750 బోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇప్పటికే 42 బోట్లను ఇచ్చినట్టు తెలిపారు. భారత్-శ్రీలంక జాలర్ల మధ్య నెలకొన్న సమస్య పరిష్కారానికి ప్రధాని మోదీతో మాట్లాడతానన్నారు.