: సినీ పరిశ్రమలో ప్రధాన కస్టమర్లు ఇద్దరే... పోలీసుల విచారణలో కెల్విన్!
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన వారిలో ఇద్దరు మాత్రమే తనకు ప్రధాన కస్టమర్లని, వారికి మాత్రమే తాను ప్రత్యక్షంగా డ్రగ్స్ సరఫరా చేశానని ఈ కేసులో ప్రధాన ముద్దాయి కెల్విన్ పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. మిగతా వారంతా తమ సహాయకులు, కారు డ్రైవర్ల సాయంతోనే తన వద్ద డ్రగ్స్ కొనుగోలు చేశారని కూడా అతను చెప్పినట్టు పోలీసు వర్గాల సమాచారం.
శతాధిక చిత్రాల్లో నటించిన ప్రముఖ హీరోతో తాజాగా చిత్రాన్ని రూపొందిస్తున్న ఓ దర్శకుడు, అతని పక్కనే అంటిపెట్టుకుని తిరుగుతూ, సినిమాలో పాత్ర లేకున్నా ప్రొడక్షన్ బాధ్యతలు చూసే హీరోయిన్ లను మాత్రమే తాను ప్రత్యక్షంగా కలుసుకున్నానని, మిగతా వారిని తాను ఎన్నడూ ప్రత్యక్షంగా కలిసింది లేదని కూడా కెల్విన్ చెప్పినట్టు సిట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. తమకు మత్తుమందులు కావాలంటే, వారు వాట్స్ యాప్ లో మెసేజ్ పెట్టేవారని, వారు చెప్పిన చోటికి తాను లేదా తన వారిని పంపి సరఫరా చేశానని చెప్పుకొచ్చాడని సమాచారం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలోని పబ్బులు, బార్లలోనే తాను ఎక్కువగా వీరిని కలిసేవాడినని, ఒక్కోసారి వారిచ్చే డబ్బుకు సరిపడినంత మాత్రమే ఇచ్చేవాడినని చెప్పాడు.