: డ్రగ్స్ కేసులో మరిన్ని విస్తుపోయే నిజాలు!


టాలీవుడ్ లో పెను ప్రకంపనలు సృష్టించిన మాదకద్రవ్యాల వ్యవహారంలో మరిన్ని వాస్తవాలు సిట్ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్‌ కేసులో చర్యలకు రెడీ అవుతున్న ఎక్సైజ్‌ అధికారులు, అంతకు ముందుగానే పక్కా ఆధారాలు సేకరించాలని భావిస్తూ, కెల్విన్‌ తదితర అరెస్టయిన నిందితుల నుంచి విచారణలో పలు కీలక నిజాలు రాబట్టారు. వాట్స్ యాప్, ఫేస్‌ బుక్‌ తదితర సోషల్ మీడియాల ద్వారా, కోడ్‌ భాషలో మాట్లాడుకుంటూ, ఆర్డర్లు తీసుకుంటూ దందాను నడిపించారు. గోవా నుంచి రోడ్డు మార్గంలో డ్రగ్స్‌ రవాణా చేయడంతో పాటు, గత రెండు సంవత్సరాలుగా జర్మనీ, నెదర్లాండ్స్‌ తదితర దేశాల నుంచి కొరియర్‌ ద్వారా మత్తుమందులు తెప్పించారు. తమ వ్యాపార విస్తరణకు వేరే ముఠాతో డీల్ కుదుర్చుకున్నాడు కెల్విన్.

'టూ పేపర్స్ ప్లీజ్' అని మెసేజ్ వస్తే, 'కలెక్ట్ ఫ్రమ్ బాయ్' అని సమాధానం వస్తుంది. ఆపై 'వేర్' అని అడిగితే, 'ఔటర్' అన్న మెసేజ్ వస్తుంది. ఇదంతా వాట్స్ యాప్ లో సాగే దందా. ఇక్కడ పేపర్ అంటే డ్రగ్స్, బాయ్ అంటే కొరియర్. ఇన్నాళ్లూ గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు బహిర్గతం కావడంతో, దీని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేయడం, లేదా విచారించి మరిన్ని నిజాలు రాబట్టడం చేస్తామని సిట్ చెబుతోంది. తాజాగా కెల్విన్ మరో ప్రముఖ దర్శకుడు, నటి పేర్లను బయట పెట్టినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. అతన్ని మరిన్ని రోజులు విచారించాలని భావిస్తున్న పోలీసులు, డ్రగ్స్‌ గ్యాంగ్‌ నేతలు ఖుద్దూస్, వాహిద్‌ లనూ ఇంకోసారి కస్టడీకి కోరాలని పిటిషన్ వేశారు.

ఇదిలావుండగా, ఓ దర్శకుడి ద్వారా ఇతర సినీ ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్న కెల్విన్, ఆరు నెలల్లో 185 సార్లు ఓ దర్శకుడి కారు డ్రైవర్ తో మాట్లాడాడని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కెల్విన్ ఫోన్ లోని సీక్రెట్ ఫోల్డర్ ను ఓపెన్ చేసి దాన్ని డీకోడ్ చేసిన అధికారులకు మరిన్ని నిజాలు తెలిసినట్టు సమాచారం. కెల్విన్ వాడిన మూడు సిమ్ కార్డులూ ప్రస్తుతం పోలీసుల వద్దే ఉన్నాయి. వాటి కాల్స్ రికార్డును పరిశీలించే పనిలో పోలీసులు ఉన్నారు.

ఇక తాను ఎవరినీ నేరుగా కలవలేదని, వారికి కోడ్ ప్రకారం డ్రగ్స్ సరఫరా చసేవాడినని కెల్విన్ సిట్ అధికారుల విచారణలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇక వారంతా క్రెడిట్ కార్డుల ద్వారా తన ఖాతాకు డబ్బులు వేసేవారని కెల్విన్ చెప్పడంతో, బ్యాంకు ఖాతాలపైనా పోలీసులు కన్నేశారు. తమకు తెలిసిన అందరి బ్యాంకు ఖాతాలనూ పరిశీలించాలని నిర్ణయించారు. తనకు ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధాలు లేవని, పేరున్న పాఠశాలల్లోని పిల్లలకు డ్రగ్స్ సరఫరా వెనుక, వారి ఆసక్తిని సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన మాత్రమే ఉందని కెల్విన్ తెలిపాడు. లోతుగా విచారించే కొద్దీ కేసులో మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News