: ఆ ఊళ్లో ప్రజలను భయపెట్టి.. లక్షలు కాజేసిన బాబా!
కంప్యూటర్ యుగంలోనూ గ్రామాల్లోని ప్రజలు మూఢనమ్మకాల వల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా దొంగ బాబాలు రెచ్చిపోతున్నారు. ఓ గ్రామంలోకి ప్రవేశించిన ఓ దొంగ బాబా అందరినీ భయాందోళనలకు గురిచేసి లక్షలు కాజేసి పారిపోయిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలం శివారులోని వింగ్వా తండాలో చోటు చేసుకుంది. చివరకు మోసపోయామని తెలుసుకున్న ప్రజలు పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చూస్తే... ఇటీవల ఆ గ్రామంలోకి ఓ బాబా ప్రవేశించాడు. గ్రామస్తుల చేతులు చూసి జాతకం చెప్పి వారి బాధలు పోవాలంటే తాను చెప్పింది చేయాలని అనేవాడు.
అందుకు గానూ రూ.200 ఫీజుగా తీసుకునేవాడు. కొన్ని రోజుల తరువాత ఆ అమాయక ప్రజలను మరింత భయపెట్టాడు. అష్టదరిద్రం పట్టుకోబోతోందని, తాను చెప్పినట్లు చేయకపోతే తీవ్రంగా నష్టపోతారని ఒక్కొక్క వ్యక్తికి చెబుతూ ప్రతి ఒక్కరి వద్దా రూ.15 వేల నుంచి 25 వేల చొప్పున తీసుకున్నాడు. మొత్తం సుమారు ఐదు లక్షల వరకు వసూలు చేసిన ఆ బాబా.. చివరికి ఆ డబ్బంతా మూటగట్టుకుని ఉడాయించాడు. బాబా పారిపోయాడని తెలుసుకున్న గ్రామస్తులకు అప్పుడుగానీ కనువిప్పు కలగలేదు. వారంతా కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ బాబా ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు.