: యూనిసెఫ్ అంబాసిడర్‌గా యూట్యూబ్ స్టార్... భారత సంతతి యువతికి దక్కిన గౌరవం
`సూపర్ ఉమెన్` పేరుతో యూట్యూబ్‌లో ఆసక్తికర వీడియోలు పోస్ట్ చేసే భారత సంతతి యువతి లిల్లీ సింగ్‌ను అంతర్జాతీయ గుడ్‌విల్ అంబాసిడర్‌గా యూనిసెఫ్ ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన యూనిసెఫ్ ఈవెంట్ `యూత్4ఛేంజ్` వేడుకలో ఈ మేరకు ప్రకటన చేసింది. కెనడాలో నివసిస్తున్న లిల్లీ సింగ్ వీడియోలు సమకాలీన అంశాలపై ఆలోచింపజేసేలా ఉంటాయి. సమాజంలో ఉన్న మూసధోరణి విధానాలను ఆమె వీడియోల ద్వారా ఖండిస్తుంది. భారతీయులకు కూడా చేరువయ్యేలా హిందీ భాషలో కూడా వీడియోలను రూపొందిస్తుంది. తన వీడియోల ద్వారా యూనిసెఫ్ ఆశయాల సాధనలో తనవంతు సహాయం చేస్తానని లిల్లీ సింగ్ తెలిపింది. యూట్యూబ్‌లో ఈమె ఛానల్‌ను 11.9 మిలియన్ల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఇటీవల ఆడపిల్లల సాధికారతను ప్రోత్సహించేందుకు తనదైన శైలిలో రూపొందించిన వీడియోను చాలా మంది మెచ్చుకున్నారు.