: అమెరికాలోని భారతీయ విద్యార్థులకు తమ రక్షణ గురించే ఆందోళన ఎక్కువ!: అధ్యయనం
ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు అమెరికన్ల మధ్య ఎలా జీవించాలి? మాకు రక్షణ ఉందా? అనే విషయాల గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) వారు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. ఆరు ప్రధాన ముస్లిం దేశాల నుంచి అమెరికాకు రాకపోకలపై నిషేధం విధించిన ట్రంప్ పాలన వారి ఆందోళనకు ప్రధాన కారణమని అధ్యయనం చెబుతోంది. కేవలం భారతీయులే కాదు అమెరికాలో చదువుకుంటున్న మిలియన్ల మంది ఇతర దేశాల విద్యార్థులు కూడా ఈ విషయం గురించి ఎక్కువగా ఆందోళన పడుతున్నారని నివేదిక తేల్చి చెప్పింది.
ఏదేమైనా, ఈ అంతర్జాతీయ విద్యార్థుల వల్లే అమెరికా ఖజానాకి 36 బిలియన్ డాలర్ల డబ్బు జమ అవుతుందని, ట్రంప్ విధానాల వల్ల ఈ ఆదాయానికి గండిపడే అవకాశం ఉందని ఐఐఈ చెబుతోంది. 1919 నుంచి ఐఐఈ వారు అంతర్జాతీయ విద్యార్థులకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నారు. నిజానికి ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. వివిధ యూనివర్సిటీలు ఇచ్చే విరాళాల ద్వారా ఇది పనిచేస్తోంది. అమెరికాకు చదువుకోవడానికి వస్తున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది మధ్యప్రాచ్య దేశాలకు చెందినవారు కాగా, భారతీయులు తర్వాతి స్థానంలో ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది.