: హృదయవిదారక ఘటన.. చిన్నారి శవాన్ని భుజాన మోసుకెళ్లిన తాతయ్య!
ఆసుపత్రుల్లో ప్రాణాలు కోల్పోయిన రోగుల్ని వారి బంధువులు భుజాన వేసుకుని ఇంటికి తీసుకెళుతున్న ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నప్పటికీ ఈ పరిస్థితి అలాగే కొనసాగుతోంది. ఓ కుటుంబానికి అంబులెన్స్ కి డబ్బులు చెల్లించే స్తోమత లేకపోవడంతో తాజాగా అటువంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఆసుపత్రిలో మృతి చెందిన ఓ బాలిక తాతయ్య ఆమెను తన భుజాల మీద వేసుకుని తీసుకెళ్లాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరీదాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. 9 ఏళ్ల లక్ష్మి అనే బాలిక తీవ్రమైన జ్వరంతో బాధపడడంతో ఆమె కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అయితే, వారి వద్ద సరిపడా డబ్బులు లేకపోవడంతో అక్కడ వైద్యులు పాపకు వైద్యం చేయలేదు. దీంతో అక్కడి నుంచి లక్ష్మిని తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ కూడా లక్ష్మికి వైద్యం చేసేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో ఆ చిన్నారి ఆసుపత్రిలోనే మృతి చెందింది. ఇక ఆ పాప మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తీసుకెళ్లాలని వైద్యులు ఆ బాలిక తాతకు సూచించారు. కనీసం అంబులెన్స్ అయినా ఇవ్వాలని ఆయన కోరాడు. అందుకు కూడా వైద్యులు ససేమిరా అని ప్రైవేటు అంబులెన్స్‌లో తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు.
వారి వద్ద అందుకు డబ్బు లేకపోవడంతో చిన్నారి లక్ష్మి మృతదేహాన్ని తన భుజాల మీద మోసుకుని ఆమె తాత కొంత దూరం వెళ్లాడు. ఆయనను గమనించిన పలువురు విలేకరులు సాయం చేసి ప్రైవేటు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. దీంతో ఆ పాపను అందులో తీసుకెళ్లారు. సదరు ఆసుపత్రి సిబ్బంది ఈ ఘటనపై నోరు విప్పడం లేదు.