: యాప్స్ ద్వారా భారత జీడీపీకి రూ. 1.4 లక్షల కోట్ల లాభం
ఇంటర్నెట్ అప్లికేషన్ల ద్వారా 2015-16లో భారత జీడీపీకి రూ. 1.4 లక్షల కోట్ల లాభం చేకూరిందని, 2020 కల్లా ఈ లాభం రూ. 18 లక్షల కోట్లకు చేరుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకానమిక్ రిలేషన్స్ (ఐసీఆర్ఐఈఆర్), బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం వారు సంయుక్తంగా తయారు చేసిన అధ్యయన నివేదికను కేంద్ర సమాచార శాఖ మంత్రి మనోజ్ సిన్హా విడుదల చేశారు.
ఈ నివేదిక ప్రకారం ఇంటర్నెట్ ద్వారా వచ్చిన ఆదాయంలో దాదాపు సగం వాటా యాప్స్ వల్ల వచ్చిందే. దేశవ్యాప్తంగా 19 టెలికామ్ సర్కిళ్లలో సమాచారాన్ని క్రోడీకరించి వీరు ఈ నివేదిక తయారుచేశారు. ప్రముఖ ఐటీ కంపెనీ సిస్కో సహాయంతో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ప్రత్యేక అవసరాల కోసం ఉపయోగించే యాప్‌ల వివరాలు సేకరించి వారు నివేదిక రూపొందించినట్లు తెలిపారు. దాదాపు 70 శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు యాప్స్ ద్వారానే ఆర్థిక కార్యకలాపాలు, ఇతర ఆర్జిత సేవలను వినియోగించుకుంటున్నారని ఈ నివేదిక తేల్చి చెప్పింది. 2020 లోగా ఇంటర్నెట్ ద్వారా భారత జీడీపీకి సమకూరే ఆదాయం 15 శాతానికి చేరుతుందని ఐసీఆర్ఐఈఆర్ తెలిపింది.