: భారత్ లో ఉండే అన్ని విద్యా సంస్థలు, ఆస్పత్రులు అమరావతికి వస్తాయి: చంద్రబాబు
అత్యున్నత విలువలతో కూడిన విద్యకు అమరావతి కేంద్రంగా మారుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు అమరావతికి వస్తాయని తెలిపారు. ఈ రోజు ఆయన అమరావతిలో నిర్మించిన ఎస్ఆర్ఎం యూనివర్శిటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో చదువుతో పాటు సంపాదన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. పలు ఆస్పత్రులు కూడా అమరావతికి రావాలని ఆకాంక్షించారు. కొండవీటి వాగు వద్ద రూ. 250 కోట్లతో నిర్మించే అతి పెద్ద పార్క్ కు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు పేరు పెడతామని చెప్పారు. దసరా రోజున పరిపాలన నగరం పనులను ప్రారంభిస్తామని తెలిపారు. కృష్ణా నది పక్కన ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలను స్థాపిస్తామని చెప్పారు.
అమరావతిలో మొట్టమొదట ప్రారంభమైన సంస్థ ఎస్ఆర్ఎందే అని చంద్రబాబు అన్నారు. రూ. 3,400 కోట్ల పెట్టుబడితో ఈ యూనివర్శిటీ నిర్మాణం మూడు విడతల్లో జరుగుతుందని చెప్పారు. 50వేల మంది విద్యార్థులు చదువుకునేలా నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ యూనివర్శిటీలో కొత్త రకం కోర్సులు అందుబాటులో ఉంటాయని అన్నారు. యూనివర్శిటీ ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు.