: డోక్లాం స్టాండాఫ్ విషయంలో ప్రభుత్వానికి విపక్షాల మద్దతు!
డోక్లాం వద్ద భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు ముక్త కంఠంతో స్వాగతించాయి. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ప్రతిపక్షాలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీ స్టాండాఫ్‌ను సమర్థించాయి. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ రక్షణ మంత్రి ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ చైనా విషయంలో నెహ్రూ వ్యవహరించినట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తే కష్టాలు తప్పవని హెచ్చరించారు. ఎటువంటి దుందుడుకు చర్యలకు పోకుండానే ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు.
దలైలామాకు ఆతిథ్యం, అమెరికా, జపాన్‌తో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించడం, అనుసరిస్తున్న విధానాలపై ప్రభుత్వం తనను తాను ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందని సీపీఎం నేత సీతారం ఏచూరి పేర్కొన్నారు. హోంమంత్రి రాజనాథ్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన దాడి గురించి కూడా చర్చించారు. కశ్మీర్ లోయలోని ఉద్రిక్త పరిస్థితులపై కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్, సీతారాం ఏచూరీలు మాట్లాడుతూ స్టేక్ హోల్డర్లతో ప్రభుత్వం బహిరంగ చర్చలకు సిద్ధం కావాలని సూచించారు. చైనాతో భారత్ వ్యవహరిస్తున్న తీరును ప్రతిపక్షాలు సమర్థిస్తున్నట్టు ఏచూరి తెలిపారు.