: ఎంత వేగంగా స్పందించామనేదే ముఖ్యం: అధికారులతో సీఎం చంద్రబాబు
అనేక కారణాలతో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని, కారణం ఏదైనా, ఎంత వేగంగా స్పందించామనేదే ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాధుల నివారణకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని, సాంకేతికతను వినియోగించుకుని ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరోగ్య సూచికలో వెనక్కి వెళ్లడానికి కారణాలను అన్వేషించాలని, మళ్లీ పూర్వ స్థితి కంటే మెరుగ్గా ఆరోగ్య సూచికలో వృద్ధి సాధించాలని సూచించారు.
ప్రతి అధికారి తమ విధులను సక్రమంగా నిర్వహించాలని, అందుబాటులో ఉన్న అన్ని సదుపాయాలు ఉపయోగించుకోవాలని, ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజల వైద్య రికార్డులను నిర్వహించాలని ఆదేశించారు. ముందస్తు వ్యాధి నిరోధక చర్యలు సమర్థంగా చేపట్టాలని, ఐటీడీఏల్లో మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆహార అలవాట్లపై గిరిజనుల్లో అవగాహన కల్పించాలని, వైద్యులను, సహాయ సిబ్బందిని సమర్థంగా వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ‘పరిశుభ్రత’ కార్యక్రమం చేపట్టాలని, సీజనల్ వ్యాధులు ప్రబలడానికి కారణమైన దోమలను నియంత్రించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.