: నేను చిన్న నటుడిని.. నా భవిష్యత్తు ఏమిటి?: నందు ఆవేదన
డ్రగ్స్ వ్యవహారంలో తనకు అధికారుల నుంచి నోటీసులు వచ్చాయని ప్రచారం జరుగుతోందని, తాను చిన్న నటుడినని, తన భవిష్యత్తు ఏమిటని నటుడు నందు ఆవేదన వ్యక్తం చేశాడు. 'పెళ్లి చూపులు' సినిమాలో నటించిన తరువాత తాను ఐదారు సినిమాలకి సైన్ చేశానని అన్నాడు. ఈ నాలుగు రోజులు తన పేరును చెబుతూ ఇలా రూమర్లు వస్తే తనకు శాశ్వతంగా ఆ ముద్ర పడిపోతుందని పేర్కొన్నాడు.
అసలు తాను ఇప్పటివరకు డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ అనే వ్యక్తి పేరే వినలేదని చెప్పాడు. తనకు ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నాయని, తనపై ఆరోపణలు రావడంతో తన కెరీర్ కు నష్టం జరుగుతుందని అన్నాడు. తాను ఎటువంటి పార్టీలకు కూడా వెళ్లనని, పబ్బుల్లోకి అస్సలే వెళ్లనని నందు చెప్పాడు. గతంలోనూ ఇలాగే తనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని అన్నాడు. అది ఓ రూమరేనని అనంతరం తెలిసినప్పటికీ ఎంతో మంది తాను అందుకు పాల్పడ్డాననే అనుకున్నారని చెప్పాడు.