: సినిమా వారు ఒక్కరే డ్రగ్స్ తీసుకుంటున్నారా?.. వారు తీసుకోవట్లేదా?: జీవిత
టాలీవుడ్‌లో కలకలం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై సినీ నటి, నిర్మాత జీవిత స్పందించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... సినిమా వారు చిన్న తప్పు చేసినా కూడా అది మీడియాలో బ్రేకింగ్ న్యూస్ గా చూపిస్తారని అన్నారు. మీడియా తమకు ఎంతగా ఉపయోగపడుతుందో, అంతే ఇబ్బందికరంగా కూడా తయారవుతోందని వ్యాఖ్యానించారు. సినిమా వారు ఒక్కరే డ్రగ్సు తీసుకుంటున్నారా? అని జీవిత ప్రశ్నించారు. ఎంతో మంది రాజకీయ నాయకుల, వ్యాపారుల పిల్లలు, ఆఖరికి రిక్షా కార్మికుల పిల్లలు కూడా తీసుకుంటున్నారు కదా? అని ఆమె అన్నారు.
అసలు మారిపోయిన సంస్కృతి ప్రభావమే ఈ డ్రగ్స్ వ్యవహారానికి ప్రధాన కారణమని జీవిత అన్నారు. అప్పట్లో పబ్బులు లేవని, ఇటువంటి కల్చర్ లేదని ఆమె అన్నారు. ఈ కల్చర్ వచ్చిన ప్రభావంతోనే పబ్బులలో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయని తెలిపారు. ఇప్పుడు ఆలోచించాల్సింది దీనిపై ఎటువంటి అవగాహన తీసుకురావాలనే విషయాన్ని అని ఆమె అన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై సమాజం మొత్తం అప్రమత్తం కావాలని చెప్పారు. ముఖ్యంగా ఆలోచించాల్సింది పాఠశాలల్లోని విద్యార్థులు కూడా ఈ వ్యసనం బారిన ఎలా పడుతున్నారనే విషయంపై అని హితవు పలికారు. స్కూళ్లలోకి డ్రగ్సు ఎలా వెళుతున్నాయి? అనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా చూడాలని అన్నారు.