: సినీ పరిశ్రమ మొత్తానికి అంటగట్టకండి: టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారంపై నటుడు శివాజీ
టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోన్న డ్రగ్స్ కేసుపై నటుడు శివాజీ స్పందించాడు. నటులు సినిమాల్లో కనిపించే పాత్రలతో నిజ జీవితంలో వారిని పోల్చకూడదని అన్నాడు. ఎంతో మంది నటులు సినిమాల్లో బాగా మందు తాగుతున్నట్లు, వారి ప్రవర్తన బాగోలేనట్లు నటిస్తారని అన్నారు. అలాగని నిజజీవితంలోనూ వారు అలాగే ఉంటారని అనుకోవద్దని వ్యాఖ్యానించాడు. అలాగే డ్రగ్స్ వ్యవహారాన్ని సినీ పరిశ్రమ మొత్తానికి అంటగట్టకూడదని శివాజీ కోరాడు. ఎవరైనా నటులు ఇందుకు పాల్పడితే అది వారి వ్యక్తిగత విషయానికి సంబంధించిందని అన్నాడు. యువనటుడు తనీష్ కూడా డ్రగ్స్ కేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని, ఆ నటుడికి ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదని తాను అనుకుంటున్నానని అన్నాడు. మీడియా ముందు కూడా భయపడుతున్నట్లు మాట్లాడుతున్న తనీష్‌పై ఇటువంటి ఆరోపణలు రావడమేంటని ప్రశ్నించారు.
సినీ పరిశ్రమలో ఉండేవారు చెడు అలవాట్లకు లోను కాకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని శివాజీ అన్నాడు. అసలు నటులు ఎంతో జాగ్రత్తగానే ఉంటారని, తమపై ఏదైనా ఆరోపణలు వస్తే అన్ని టీవీల్లో, పేపర్లలో తమ పేరు వస్తుందనే భయం వారిలో ఉంటుందని చెప్పాడు.