: చరిత్ర తిరగేస్తే నేరస్తుడిని నేనో, చంద్రబాబో తేలుతుంది: ముద్రగడ పద్మనాభం
1994 నుంచి చరిత్ర తిరగేస్తే నేరస్థుడిని తానో..చంద్రబాబో తేలుతుందని, తన నేరచరిత్ర ఏంటో చంద్రబాబు నిరూపించాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపుల కోసం పోరాడుతున్న తనపై ఉగ్రవాది ముద్ర వేయడం బాధిస్తోందని, గతంలో చంద్రబాబు పాదయాత్ర చేసిన నమూనా కాపీ ఇస్తే, తాను దరఖాస్తు చేసుకుంటానని, అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా 26న పాదయాత్ర ఆగదని అన్నారు. 26 లోగా కాపులను బీసీల్లో చేర్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ఇది ఆఖరి పోరాటమని, తన జాతి కోసం ప్రాణాలు పోయినా ఫర్వాలేదని, ధైర్యం ఉంటే తనను అరెస్టు చేయాలని అన్నారు. తుని ఘటనలో విధ్వంసానికి చంద్రబాబునాయుడే కారణమని, రైల్వేస్టేషన్ లో బందోబస్తు ఏర్పాటు చేస్తే ఈ ఘటన జరిగేది కాదని అన్నారు. వాయిదాలు లేకుండా తుని ఘటన కేసు విచారణ జరిపించాలని, శాంతియుతంగా పోరాడుతున్న తమపై కేసులు పెడతారా? అంటూ మండిపడ్డ ఆయన, కాపులను మోసగించిన చంద్రబాబుపై ఎందుకు కేసులు పెట్టరని ప్రశ్నించారు.