: బీఫ్ ను తరలిస్తున్నాడన్న అనుమానంతో.. బీజేపీ నేతను చితగ్గొట్టిన గోరక్షకులు!
ఎవరయినా బీఫ్ తరలిస్తున్నారన్న అనుమానం వస్తే చాలు, వారి వద్దకు వెళ్లి దాడికి పాల్పడుతున్న గోరక్షకులు చివరికి బీజేపీ నేతను కూడా వదలలేదు. ఇటువంటి చర్యలకు పాల్పడేవారు ఎవరైనా సరే చితగ్గొట్టితీరుతాం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన సలీం షా అనే బీజేపీ నేతపై ఈ విషయంలో అనుమానం పెంచుకున్న గోరక్షకులు ఆయనను చావబాదారు. దీంతో సదరునేత సృహ కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకుని వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆయనపై దాడికి పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై సలీం భార్య స్పందిస్తూ... తాము ఎన్నడూ బీఫ్‌ను తరలించలేదని అన్నారు. స్థానిక మసీదులో జరుగుతున్న కార్యక్రమానికి మాత్రం మాంసం తరలిస్తున్నామని చెప్పారు. సలీం మాంసం తరలించేందుకు వినియోగించే ఓ బ్యాగును స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని ఫోరెన్సిక్ బృందానికి అప్పగించారు. దీనిపై నిజానిజాలు తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.