: కరెన్సీని బయటకు వదులుతూ 'ప్లీజ్ హెల్ప్' అని మొత్తుకున్న ఏటీఎం... ఏం జరిగిందో తెలిస్తే అవాక్కే!
టెక్సాస్ లోని కార్పస్ క్రిస్టీ సమీపంలో మిట్టమధ్యాహ్నం పూట ఓ పోలీస్ ఆఫీసర్ తన వాహనంలో వెళుతుంటే, అటుగా వచ్చిన ఓ వ్యక్తి, సమీపంలోని ఏటీఎం నుంచి 'ప్లీజ్ హెల్ప్' అని రాసివున్న కాగితాలు బయటకు వస్తున్నాయని ఫిర్యాదు చేశాడు. తొలుత దాన్ని ఓ జోక్ గా భావించినా, మరికొందరు కూడా తాము డబ్బు డ్రా చేసుకుంటే, కరెన్సీతో పాటు సాయం చేయాలని రాసిన కాగితాలు బయటకు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. అది బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏటీఎం. ఆపై సదరు అధికారి మెషీన్ దగ్గరకు వెళ్లి పరిశీలించాడు. దాన్ని తట్టి చూశాడు. లోపలి నుంచి సన్నగా మూలుగులు, శబ్దాలు వినిపించాయి.
"అవును నిజమే. సన్నగా ధ్వని వస్తోంది" అని స్పష్టం చేసిన అధికారి, వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశాడు. ఓ గోడకు ఆన్చి ఉన్న ఏటీఎం మెషీన్ ను ఓపెన్ చేసి చూసి అవాక్కయ్యారు. ఏటీఎం వెనుక ఓ వ్యక్తి చిక్కుకుని ఉన్నాడు. ఏటీఎంను అమర్చిన సర్వీస్ రూంలోపల అతను చిక్కుకుని, కాపాడాలని కోరుతూ, ఎవరు కరెన్సీని విత్ డ్రా చేస్తున్నా, ఆ డబ్బుతో పాటు 'ప్లీజ్ హెల్ప్' అంటూ రాసిన కాగితాలను వదులుతున్నాడు. ఏటీఎం వెనుకవైపున్న డోర్ లాక్ ను రిపేర్ చేసేందుకు వచ్చిన అతన్ని చూసుకోకుండానే, అక్కడి సిబ్బంది బయటకు వచ్చేశారని పోలీసులు తెలిపారు. ఇక అతని ఫోన్ మరో గదిలో ఉండిపోవడంతో, ఏం చేయాలో తోచక ఈ పని చేశాడు. ఇక అతని పేరును మాత్రం పోలీసులు బయట పెట్టలేదు.