: ఫలానా వారి పేర్లు ఉన్నాయి, ఏం చేద్దామని ముందే అల్లు అరవింద్, సురేశ్ బాబులను అడిగిన సిట్!
డ్రగ్స్ రాకెట్ లో భాగంగా కెల్విన్ ను విచారించిన వేళ, సినీ ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే, విస్తుపోయిన ప్రత్యేక దర్యాఫ్తు బృందం అధికారులు, ఆ సమాచారాన్ని తొలుత సినీ పెద్దలకు చేరవేసినట్టు తెలుస్తోంది. సినీ ప్రముఖుల పేర్లన్నింటినీ క్రోఢీకరించిన తరువాత, ఆ జాబితాను అకున్ సబర్వాల్ కు ఇవ్వగా, హై ప్రొఫైల్ వ్యక్తుల చుట్టూ సాగే విచారణ కాబట్టి, ప్రభుత్వానికి, సినిమా రంగంలో పేరున్న వ్యక్తులైన అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పెద్దలకు ఈ జాబితాను ఇచ్చి, వారి నుంచి కూడా సలహా తీసుకున్నట్టు సమాచారం.
డ్రగ్స్ దందాలో ఎవరున్నా వదిలిపెట్టవద్దని వారి నుంచి వచ్చిన సూచనతోనే నోటీసులు ఇచ్చేందుకు సిట్ ముందుకు కదిలింది. విషయంలోని తీవ్రతను ముందుగానే తెలుసుకున్నారు కాబట్టే రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు మీడియా ముందుకు వచ్చిన పరిశ్రమ పెద్దలు, దీని వెనుక ఎవరున్నా ఉపేక్షించబోమని, వారితో సినిమాలు చేయబోమని కాస్తంత గట్టిగానే మాట్లాడారు. విచారణకు తమ వంతు సహకారాన్ని పూర్తిగా అందిస్తామని కూడా వారు సిట్ కు వెల్లడించినట్టు తెలుస్తోంది.