: సినీ పరిశ్రమలోని ఆ పదిమందిని సిట్ ఆఫీస్ లోనే విచారిస్తాం...బయట కాదు...రహస్యం లేదు: అకున్ సబర్వాల్
సినీ పరిశ్రమలో డ్రగ్స్ తో సంబంధం ఉన్న ఆ పదిమందిని సిట్ ఆఫీసులోనే విచారిస్తామని ఎక్సైజ్ డీఐజీ అకున్ సబర్వాల్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సినీ పరిశ్రమకు సంబంధించిన 19 మందిపై కేసులు నమోదు చేశామని అన్నారు. పది మంది నోటీసులు తీసుకుని సంతకాలు చేశారని ఆయన చెప్పారు. మరో తొమ్మిది మందికి నోటీసులు జారీ చేశామని, వారు అందుకోవాల్సి ఉందని, వారు అందుబాటులో లేకపోవడంతో వారికి నోటీసులు అందజేయలేకపోయామని ఆయన చెప్పారు. నోటీసులు వారు అందుకున్న తరువాత విచారణ చేస్తామని ఆయన తెలిపారు.
కాగా, ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు లిస్ట్ లో ఉన్నారని ఆయన చెప్పారు. వారందరికీ నోటీసులు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వారందర్నీ సిట్ ఆఫీసులోనే విచారిస్తామని ఆయన చెప్పారు. అయితే విచారణలో అంశాలను బయటకు పొక్కనీయమని ఆయన తెలిపారు. విచారణలోని అంశాలు రహస్యంగా ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు. హీరోయిన్లను మాత్రం రహస్యంగా విచారిస్తామని ఆయన తెలిపారు. వారి మర్యాదకు భంగం కలుగకుండా వారిని విచారిస్తామని ఆయన తెలిపారు. అయితే నిందితులెవరైనా ఒకటేనని ఆయన చెప్పారు.