: కష్టకాలంలో సత్తా చాటిన ఇన్ఫోసిస్... లాభాల ప్రకటనతో ఈక్విటీ జంప్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సత్తాను చాటింది. ఆటోమేషన్, క్లౌడ్ విస్తరణ, అగ్రరాజ్యాల ఆంక్షలు తదితర కారణాలతో ఐటీ రంగం కుదేలవుతోందని వార్తలు వస్తున్న వేళ, ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో 1.3 శాతం నెట్ ప్రాఫిట్ ను నమోదు చేసినట్టు ప్రకటించింది. ఈ ఉదయం ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మూడు నెలల కాలంలో నికర లాభం రూ. 3,483 కోట్లుగా నమోదైందని సంస్థ పేర్కొంది. మొత్తం ఆదాయం 1.7 శాతం పెరిగి రూ. 17,078 కోట్లకు చేరుకుందని వెల్లడించింది.
ఇక ఈ వార్త స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచింది. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభమైన తరువాత, ఓ వైపు అమ్మకాల ఒత్తిడితో సూచికలు నేల చూపులు చూస్తున్నప్పటికీ, ఇన్ఫోసిస్ లాభాల్లో నడుస్తోంది. ఉదయం 9:30 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 40 పాయింట్లు నష్టపోయి, 32 వేల స్థాయి నుంచి కిందకు జారగా, ఇన్ఫీ ఈక్విటీ, 1.40 శాతం పెరిగి 990 రూపాయలను దాటింది. ఇదే సమయంలో టీసీఎస్ 2.33 శాతం నష్టంతో ట్రేడ్ అవుతుండటం గమనార్హం.