: కశ్మీర్ అంశంలో చైనా ఉత్సాహంపై ఇండియా నీళ్లు.. మా విషయంలో వేలు పెట్టొద్దన్న భారత్!


కశ్మీర్ అంశంలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న చైనా ఆఫర్‌ను భారత్ నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. ఉచిత సలహాలు మాని మీ పని మీరు చేసుకుంటే మంచిదని హితవు పలికింది. పాకిస్థాన్‌తో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తమకు తెలుసని స్పష్టం చేసింది.

భారత్-పాక్ మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి నిర్మాణాత్మకమైన పాత్ర పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బుధవారం చైనా పేర్కొంది. చైనా వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బగ్లే మండిపడ్డారు. కశ్మీర్ అంశం ఇరు దేశాలకు సంబంధించినదని, పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక చర్చల ద్వారా దానిని పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. ఇందులో మూడో దేశం జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పారు. అలాగే కశ్మీర్‌లో భారత్ రసాయన ఆయుధాలు ఉపయోగిస్తోందన్న పాక్ ఆరోపణలను గోపాల్ కొట్టిపడేశారు. తామెప్పుడూ, ఎక్కడా, ఏ సందర్భంలోనైనా, ఎవరిపైనా రసాయన ఆయుధాలు ఉపయోగించబోమని, దానికి భారత్ పూర్తిగా వ్యతిరేకమన్నారు.

చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గెం షాంగ్ మాట్లాడుతూ దక్షిణాసియా దేశాల్లో భారత్-పాక్‌లు అతి ముఖ్యమైన దేశాలని, అయితే కశ్మీర్ పరిస్థితి అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ఇది శాంతికే కాకుండా రెండు దేశాల సుస్థిరతను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్ విషయంలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.

  • Loading...

More Telugu News